చెన్నైలో తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు

Spread the love

తెలుగు భక్తులందరికీ నమస్కార సుమాంజలులు.

గత కొన్ని భాగాల్లో తమిళనాడులోని ప్రముఖ దివ్యదేశాలు, పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో దేవాలయాల నగరంగా పేరొందిన చెన్నైలో తప్పక దర్శించాల్సిన కొన్ని మహిమాన్వితమైన ఆలయాల గురించి తెలుసుకుందాం.

ఈ యాత్రలో ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కువగా చెన్నై సబర్బన్ లోకల్ ట్రైన్ మరియు కొద్దిపాటి ఆటో ప్రయాణంతోనే అనేక ప్రసిద్ధ ఆలయాలను దర్శించవచ్చు. ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకోకుండా ప్రశాంతంగా యాత్రను పూర్తి చేయవచ్చు.


1. శ్రీ చెన్నకేశవ పెరుమాళ్ ఆలయం – పారీస్ కార్నర్

మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిన తరువాత, స్టేషన్ వెనుకవైపు ఉన్న మూర్ మార్కెట్ (Moore Market) వైపు బయటకు రండి. అక్కడి నుంచి పారీస్ కార్నర్ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది చెన్నైలో అత్యంత రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలలో ఒకటి.

ఈ ప్రాంతంలోనే వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ పెరుమాళ్ ఆలయం చెన్నైలోని అత్యంత పురాతనమైన వైష్ణవ ఆలయాలలో ఒకటి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన ప్రశాంతత మనసును ఆవరించేస్తుంది.

స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, శ్రీ చెన్నకేశవ పెరుమాళ్ స్వామివారి పేరుమీదుగానే చెన్నపట్టణం అనే పేరు ఏర్పడి, కాలక్రమేణా అది “చెన్నై”గా మారింది అని చెబుతారు.

స్వామివారి దివ్యదర్శనం అనంతరం, అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన శ్రీ చెన్నమల్లీశ్వర స్వామి శివాలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఒకే ప్రాంగణంలో శివ-కేశవులను దర్శించడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు.


2. శ్రీ పార్థసారథి స్వామి దివ్యదేశం – తిరువల్లిక్కేణి

ఇక్కడి నుంచి ఆటోలో సుమారు 2 కి.మీ. దూరంలో ఉన్న చెన్నై పోర్ట్ రైల్వే స్టేషన్కు వెళ్లండి.

అక్కడి నుంచి లోకల్ ట్రైన్‌లో తిరువల్లిక్కేణి (Thiruvallikeni) స్టేషన్‌కు చేరుకోండి.

స్టేషన్ నుంచి కొద్దిదూరం సన్నని వీధుల గుండా నడుస్తూ వెళ్తే, 108 దివ్యదేశాలలో ఒకటైన శ్రీ పార్థసారథి స్వామి ఆలయందర్శనమిస్తుంది.

మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా నిలిచిన శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మీసాలతో దర్శనమివ్వడం ఈ ఆలయ విశేషం. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని తిలకిస్తుంటే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది.

ఈ ఆలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని గడపాలని మా వినమ్ర సలహా.


3. శ్రీ ముండకన్నియమ్మన్ ఆలయం

తిరిగి తిరువల్లిక్కేణి స్టేషన్‌కు వచ్చి ముండకన్నియమ్మన్ కోయిల్ (Mundakakanni Amman Koil) స్టేషన్‌కు టికెట్ తీసుకోండి.

స్టేషన్ నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ప్రసిద్ధ శ్రీ ముండకన్నియమ్మన్ ఆలయం ఉంటుంది.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు చెన్నై ప్రజలకు అత్యంత ఆరాధ్య దేవత. నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.


4. శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం – మైలాపూర్

మళ్లీ స్టేషన్‌కు చేరుకుని వేలాచేరి వైపు వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కి సుమారు 10 నిమిషాల్లో తిరుమైలై (Mylapore) స్టేషన్ చేరుకోండి.

స్టేషన్ నుంచి నడిచే దూరంలోనే దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం ఉంది.

చెన్నై నగరానికి ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నం. ఇక్కడి గోపురం, శిల్పకళ, ప్రశాంత వాతావరణం ప్రతి భక్తుడినీ ఆకట్టుకుంటాయి.


5. శ్రీ వెల్లీస్వరర్ ఆలయం

కపాలీశ్వర ఆలయానికి వెనుకవైపునే ఉన్న శ్రీ వెల్లీస్వరర్ ఆలయం నవగ్రహాలలో శుక్ర భగవానునికి సంబంధించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచి ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.


6. శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం

వెల్లీస్వరర్ ఆలయం నుంచి కొద్దిదూరం నడిస్తే శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం వస్తుంది.

చిన్నదైనా, అత్యంత ప్రశాంతమైన ఈ ఆలయంలో స్వామివారి దివ్యరూపం ఎంతో మనోహరంగా ఉంటుంది. రద్దీకి దూరంగా భక్తితో స్వామివారిని దర్శించుకోవచ్చు.


మైలాపూర్ ప్రత్యేకత

దర్శనాల అనంతరం కొద్దిసేపు మైలాపూర్ మార్కెట్లో నడవండి.

ఇక్కడ దొరికే మైలాపూర్ ఫిల్టర్ కాఫీ రుచి చూడడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా పూల దుకాణాలు, పూజా సామగ్రి, సంప్రదాయ వస్తువులు కూడా చూడవచ్చు.


7. శ్రీ మరుందీశ్వర స్వామి ఆలయం – తిరువాన్మియూర్

తిరిగి తిరుమైలై స్టేషన్‌కు వచ్చి తిరువాన్మియూర్ స్టేషన్ చేరుకోండి.

అక్కడి నుంచి ఆటోలో శ్రీ మరుందీశ్వర స్వామి ఆలయంకు వెళ్లండి.

ఈ ఆలయం 275 పాడల్ పెట్ర స్థలాలలో ఒకటి. పరమశివుడు వైద్యుని రూపంలో భక్తులకు అనుగ్రహించిన క్షేత్రంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం భక్తులు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటారు.


8. శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం – బెసంట్ నగర్

మరుందీశ్వర ఆలయం నుంచి ఆటోలో బెసంట్ నగర్ బీచ్ వద్ద ఉన్న శ్రీ అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకోండి.

సముద్ర తీరాన వెలసిన ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాలలో ఒకటి.

అష్టలక్ష్మీ అమ్మవారి ఎనిమిది రూపాలను ఒకే ఆలయంలో దర్శించుకునే అదృష్టం ఇక్కడ లభిస్తుంది.

సాయంత్రం సముద్రపు చల్లని గాలిలో అమ్మవారి దర్శనం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది.


9. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం – అడయార్

అష్టలక్ష్మీ ఆలయం నుంచి ఆటోలో అడయార్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంకు వెళ్లండి.

ఆలయం పరిమాణంలో చిన్నదైనా, స్వామివారి శయన తిరుకోలం అత్యంత అందంగా ఉంటుంది.

ఈ ఆలయంలోని ప్రశాంతత భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.


ఒక చిన్న సూచన

చెన్నైలో ఆలయాల దర్శనానికి లోకల్ ట్రైన్ ఎంతో ఉపయోగకరమైనది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ ఆలయాలను దర్శించవచ్చు. వీలైతే ఉదయం తొందరగా యాత్ర ప్రారంభిస్తే ప్రశాంతంగా అన్ని దర్శనాలు పూర్తి చేసుకోవచ్చు.


తదుపరి భాగంలో…

ఈ యాత్ర ఇంకా పూర్తికాలేదు.

తదుపరి భాగంలో చెన్నైలోని మరికొన్ని మహిమాన్వితమైన ఆలయాలైన వడపళని మురుగన్ ఆలయం, కందకోట్టం మురుగన్ ఆలయం, కాళికాంబాళ్ ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, మాధవ పెరుమాళ్ ఆలయం, యోగ నరసింహ స్వామి ఆలయంవంటి ప్రసిద్ధ క్షేత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం.


శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।

శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ॥

ఈ సమాచారం మీకు ఉపయోగపడితే, దయచేసి మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.

మా ఈ చిన్న ప్రయత్నానికి మీరు అందించే గోరంత సహాయం, మాకు కొండంత బలాన్ని ఇస్తుంది.

శ్రీమన్నారాయణుని, పరమశివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ఈ వెబ్‌సైట్ కస్టమైజేషన్‌పై మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు లేదా అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

Payment Banner

Spread the love

Leave a Reply